హిందూ మహాసముద్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద తిమింగలాల శ్మశానవాటిక .. 50 లక్షల ఏళ్ల నాటి రహస్యాలు వెలుగులోకి!

  • ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో 7,002 మీటర్ల లోతున శ్మశాన వాటికను గుర్తించిన చైనా పరిశోధకులు 
  • 50 లక్షల ఏళ్ల నాటి 500 తిమింగలాల శిలాజాలను కనుగొన్న వైనం
  • సముద్ర గర్భంలోని అరుదైన జీవులకు ఆహారంగా, ఆవాసంగా మారిన అవశేషాలు
సముద్ర గర్భంలో దాగివున్న అంతుచిక్కని రహస్యాలను ఛేదించే ప్రయత్నంలో చైనా శాస్త్రవేత్తలు ఒక అపూర్వ ఆవిష్కరణ చేశారు. ఆగ్నేయ హిందూ మహాసముద్రంలో ప్రపంచంలోనే అత్యంత లోతైన, అతిపెద్ద తిమింగలాల శ్మశానవాటిక (Whale Graveyard)ను వారు కనుగొన్నారు. ఆస్ట్రేలియాకు పశ్చిమంగా ఉన్న 'డయామంతినా ఫ్రాక్చర్ జోన్‌'లో సుమారు 1,200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ భారీ తిమింగలాల సమాధులు బయటపడ్డాయి. ఈ పరిశోధనకు సంబంధించిన సంచలన వివరాలు ప్రఖ్యాత అంతర్జాతీయ సైన్స్ జర్నల్ 'నేచర్'లో ప్రచురితమయ్యాయి.

చైనాకు చెందిన అత్యాధునిక మానవసహిత జలాంతర్గామి 'ఫెండౌఝే' (Fendouzhe) ఈ పరిశోధనలో కీలకపాత్ర పోషించింది. సముద్ర ఉపరితలం నుంచి ఏకంగా 7,002 మీటర్ల (దాదాపు 7 కిలోమీటర్లు) అగాధంలోకి వెళ్లి ఈ శ్మశానవాటికను గుర్తించింది. సాధారణంగా 4,000 మీటర్ల లోతులోనే తిమింగలాల అవశేషాలు కనిపిస్తాయి. కానీ, ఇంతటి అగాధంలో (Hadal Zone) వందల సంఖ్యలో తిమింగలాల శిలాజాలు లభించడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి. ఇక్కడ దాదాపు 50 లక్షల సంవత్సరాల క్రితం నాటి సుమారు 500 తిమింగలాల అవశేషాలను శాస్త్రవేత్తలు గుర్తించారు.

  'వేల్ ఫాల్'తో కొత్త జీవ ప్రపంచం
ఈ పరిశోధనలో 'వేల్ ఫాల్' అనే అద్భుతమైన జీవ ప్రక్రియను శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా గమనించారు. తిమింగలాలు చనిపోయి సముద్రం అడుగు భాగానికి చేరినప్పుడు, వాటి కళేబరాలు అక్కడి జీవులకు దశాబ్దాల పాటు ఆహారంగా, ఆవాసంగా మారతాయి. సూర్యరశ్మి సోకని ఆ కటిక చీకటిలో ఈ తిమింగలాల అస్థిపంజరాల చుట్టూ ట్యూబ్ వార్మ్స్, స్టార్ ఫిష్, జెల్లీఫిష్ వంటి అరుదైన జీవులు ఒక కొత్త జీవ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి.

ఈ ఆవిష్కరణతో ఇప్పటివరకు ప్రపంచానికి తెలియని, అంతరించిపోయిన ఒక కొత్త తిమింగలం జాతిని కూడా గుర్తించారు. ఈ శిలాజాలు గడిచిన 50 లక్షల ఏళ్లలో తిమింగలాల పరిణామ క్రమాన్ని, నాటి సముద్ర పర్యావరణ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఎంతగానో దోహదపడతాయని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డీప్-సీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలు తెలిపారు. భూమిపై అత్యంత కఠినమైన పరిస్థితుల్లోనూ జీవం ఎలా పరిఢవిల్లుతుందో చెప్పడానికి ఈ ఆవిష్కరణ ఒక తిరుగులేని నిదర్శనమని వారు పేర్కొన్నారు.

Whale Graveyard
Indian Ocean
Fendouzhe Submersible
Marine Fossils
Deep Sea Research
Nature Journal

More Telugu News